Essenes: A Brief History:
ప్రపంచ చరిత్రలో బైబిల్ ఒక సంచలనం, గొప్పవారు మొదలుకొని సాధారణ ప్రజల వరకు బైబిల్ వారిపై చూపించిన ప్రభావం గాని, వారి మనసులో పెనవేసుకున్న అనుబంధాన్ని గాని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలాంటి పరిశుద్ధ గ్రంథము యొక్క కూర్పుకు ,అలాగే ఆ గ్రంధాన్ని వ్రాయటానికి అనేకమంది ప్రయాసపడ్డారు.
దానిని భద్రపరచడానికి, తర్వాత తరాల వారికి అందించటానికి ప్రయాస పడినవారు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఇలా కొంతమంది యొక్క ప్రయాస స్పష్టంగా బయటకి కనిపించింది. కానీ మరికొంతమంది కష్టం బయటకు కనిపించలేదు, వారి పేరు వినిపించనూలేదు అయినా కూడా పరిశుద్ధ గ్రంధం పరిరక్షణ కోసం, భద్రత కోసం వారు పడిన ప్రయాస అమితమనే చెప్పాలి.
అలా ఏమాత్రం కనీస గుర్తింపుకు నోచుకోకపోయినా, వారి కష్టం బయటికి కనిపించకపోయినా పరిశుద్ధ గ్రంథలేఖనాలను ఎంతగానో భద్రపరిచిన ఒక ప్రాముఖ్యమైన యూదుల తెగ కోసమే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము.
వారే ఎస్సెన్స్ అని పిలువబడే నిష్ఠ కలిగిన ఒక యూదాశాఖ. The Strange History of the Essenes – ఎస్సెన్స్
ఎస్సెన్స్ – Essenes
బైబిల్ గ్రంధంలో పురాతన యూదులలో మనకి కనిపించే ప్రాముఖ్యమైన కొన్ని శాఖలున్నాయి. వారు కొత్త నిబంధనలో కూడా చాలాసార్లు కనిపిస్తారు.
వారే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మ శాస్త్ర ఉపదేశకులు ఇలా కొన్ని ముఖ్యమైన శాఖలు కనిపిస్తాయి. కానీ ఏ మాత్రం గుర్తింపునకు నోచుకోని మరో ప్రాముఖ్యమైన తెగయే ఈ “ఎస్సైనులు”.
The Strange History of the Essenes – ఎస్సెన్స్
ఎస్సేన్స్ యొక్క ఉనికి :
ఈ ఎస్సేనులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి రోమ్ మరియు యూదయ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవారు. నిజానికి యూదా సమాజంలో ఉన్న మూడు ప్రాముఖ్యమైన తెగలలో ఎస్సేన్స్ కూడా ఒకరు.
పరిసయ్యులు, సద్దుకయ్యులతో పోల్చిచూస్తే వీరు చాలా కొద్దిమంది అనే చెప్పాలి. ఈ శాఖను ఎస్సేని, ఒస్సేయి, ఎస్సేయన్స్ అని కూడా అప్పట్లో పిలుస్తూ ఉండేవారు.
కానీ వీరి పేరుకున్న ప్రాముఖ్యత ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. వీరు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే శాఖలతో విడిపోయిన వారిగా సాధారణంగా వారి కోసం చరిత్ర చెప్తుంది.
ఇంచుమించు వీరి ఉనికి క్రీస్తుశకం మొదటి శతాబ్దం వరకు కనిపిస్తుంది. తరువాత వీరి ప్రస్తావన పెద్దగా కనిపించదు. పరిసయ్యులు, సద్దుకయ్యుల ద్వంద్వ వైఖరికి, దేవాలయాన్ని పరిశుద్దతను పాడుచేసే వారి విధివిధానాలకు విసిగిపోయిన భక్తి కలిగిన యూదులు.
ఈ సమూహంలో చేరటానికి అరణ్యాలకు, ఎడారుల కు వెళ్లిపోయేవారు. ఎందుకంటే ఈ ఎస్సేనులు సమాజానికి దూరంగా అరణ్యాలలో నివసించే వారు.
అంతే కాక వీరు ఎరుషలేము దేవాలయం లో జరిగే ఏ బలి అర్పణలకు ఏమాత్రం వెళ్లరు. ఎందుకంటే అప్పటి యాజకుల యొక్క అపవిత్రమైన ఆచారాల వలన మందిరాన్ని, మందిర క్రమాన్ని వారు అపవిత్ర పరుస్తున్నారు అని వీరు బలంగా నమ్మేవాళ్ళు.
అందుకనే వీరు పరిసయ్యులు, సద్దుకయ్యుల నుండి దూరమై పోయి ఒక ప్రత్యేకమైన తెగగా బ్రతకటం ప్రారంభించారు. దేవుని ఉనికి వారి మధ్య ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతారు.
నిత్యం దేవుని ఆరాధనలో, లేఖన ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. తమను తాము “వెలుగు పుత్రులుగా, వెలుగు సంబంధులుగా “పిలుచుకుంటారు.
ఎస్సేన్స్ యొక్క జీవనశైలి :
ఈ ఎస్సేనులు కఠినమైన భక్తి నియమాలు కలిగినవారు. వీరు మత నిష్ఠ అధికంగా కలిగిన జనాంగం. అందుచేత మిగిలిన యూదులలో నుండి వేరై వారికి దూరంగా ఖుమ్రాన్ అనే ప్రాంతంలో జీవించటం ప్రారంభించి, వారి జీవితాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించారు.
వారి జీవిత కాలములో, వారు సాధారణమైన జీవితాన్ని గడుపుతూ,పేదరికంలో జీవించేవారు. లోకపరమైన ఆనందాలకు దూరంగా ఉండటం ద్వారా ఆధ్యాత్మికంగా జ్ఞానాన్నిపొందుకోవాలి అని కోరుకుంటారు.
ఎస్సేన్లు శాఖాహారులు, వారు వివాహం చేసుకోరు, కోపాన్ని ప్రదర్శించడం లాంటి బలహీనతలు వారికి నిషేధం. ప్రవక్తల గ్రంధాలను అధ్యయనం చేస్తారు మరియు వారి పవిత్ర రచనలను జాగ్రత్తగా భద్రపరిచేవారు.
ఈ సమూహంలో చేరిన వారు వారి ఆస్తిని సామూహికంగా అందరు కలిసి వాడుకుంటారు. వీరి వివాహ జీవితం మీద కొంత గందరగోళం ఉన్నప్పటికీ వారు పిల్లలను దత్తత తీసుకునేవారని మరియు వారిలో వివాహం చేసుకున్న ఎస్సెన్లు తమ గర్భాన పుట్టిన పిల్లలను పెంచుకునేవారని చరిత్రకారుడైన జోసెఫస్ తన గ్రంధాలలో రాసుకొచ్చాడు.
ఎస్సేనులు వారి శాఖలో పెద్దలకు తప్పక కట్టుపడి ఉంటారు. పెద్ద, పెద్ద నేరాలు చేసే వారికి సంఘ బహిష్కరణ విధించబడుతుంది. ఎస్సేన్లు పరిశుద్ధతకు పెద్దపీట వేస్తారు.
వారు ప్రమాణము చేయటాన్న పెద్దగా పట్టించుకోరు, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ఖచ్చితమైన మాట సరిపోతుందని వారు భావించేవారు.
తరచుగా నీటిలో ముంచడం ద్వారా శుద్దీకరణ అనే ఆచార స్నానపు అలవాట్లు కూడా వీరికి ఉండేవి. ఇది వీరికి ఉన్న ప్రత్యేకత అని చెప్పాలి.
ఎస్సేన్స్ చేసే ముఖ్యమైన పని :
ఈ ఎస్సేనులు పరిసయ్యులు , సద్దుకయ్యులలో నుండి విడిపోయి ఒక తెగగా తయారవ్వటానికి ముఖ్యకారణం దేవునితో అధికసమయం గడటానికి.
వీరు ప్రవక్తల గ్రంధాలను చదువుతూ, ధ్యానం చేస్తూ, ధర్మశాస్త లేఖనాలను, ప్రవక్తల లేఖనాలను వారు తమ స్వంత చేవ్రాతతో నకలు తయారు చేసేవారు.
అంటే వాటి కాపీలను మళ్ళి వ్రాసేవారు. వారు దైవగ్రంధాన్ని ఎంత నిష్ఠగా తిరిగి లిఖించేవారంటే, వారు వ్రాస్తున్నప్పుడు దేవుని పేరును ఎప్పుడు వ్రాయవలసి వచ్చినా, అంటే అడోనాయ్ అని గాని, యెహోవా అని గాని ఎప్పుడు వచ్చినా ఆ పేరు వ్రాయటానికి ముందు ఒకసారి వ్రాసిన తర్వాత ఒకసారి “మిక్వస్” అని పిలిచే మలచబడ్డ స్నానపు తొట్టెలలో (గుంటలలో ) పరిశుద్ధ స్నానమాచరించేవారు.
అడోనాయ్ అనే పదం 7736 సార్లు అలాగే యెహోవా అనే పదం 3358 సార్లు పరిశుద్ధ గ్రంధంలో వ్రాయబడింది. అంటే ఎన్ని సార్లు వీరు మిక్వస్ లో స్నానం చేసేవారో అర్ధం చేసుకోండి.
అంత పరిశుద్ధంగా దేవుని పేరును వ్రాసేవారు. ఇలా వారి జీవితకాలంలో వీరు చేతి వ్రాతతో వేలకొలది పరిశుద్ధ లేఖనాల ప్రతులకు నకల్లను తయారు చేసారు.
ఒకవేళ వారు వ్రాసే క్రమంలో ఏదైనా తప్పు వస్తే దాన్ని రుద్దటం గాని, కొట్టివేసి ప్రక్కనుండి వ్రాయటం గాని చేయరు. ఆ ప్రతి మొత్తాన్ని తీసివేసి కాల్చేసే వారు.
దాని స్తానంలో మల్లి మొదట నుండి మరో ప్రతిని వినియోగించి ఒక్క తప్పు కూడా లేకుండా వ్రాసేవారు. అలా చాలా కష్టానికి ఓర్చి ఎస్సేన్స్ పరిశుద్ధలేఖనాల యొక్క నకల్లను తయారు చేసేవారు.
ఎస్సేన్స్(Essenes) వ్రాసిన చేవ్రాతలు – నకల్లు :
క్రీస్తుశకం 66 నుండి 73 వరకు రోమన్ సైన్యం యూదులను హతమారుస్తూ వచ్చింది. అప్పుడే యేరుషలేమును, అందులో ఉన్న దేవుని మందిరాన్ని నాశనం చేశారు.
ఆ క్రమంలోనే ఎస్సేన్లు వారు వ్రాసిన ప్రతులను ఆ రోమనుల బారిన పడకుండా కాపాడే క్రమంలో కొన్ని వందల ప్రతులను మట్టికుండలో పెట్టి మృత సముద్రంకి ఎదురుగా ఉండే ఖుమ్రాన్ గుహలలో వాటిని దాచి పెట్టి, తిరిగి వారి నివాస స్థలానికి చేరుకున్నారు.
ఆ క్రమంలోనే రోమనుల చేతిలో వారు సమూలంగా హతమార్చబడ్డారు. రోమన్ల చేతిలో వారు హతమార్చ బడినప్పటికీ వారు తయారుచేసిన ప్రతులు నేటికీ దేవుని ఉనికిని ప్రశ్నించే ప్రతి వారికి సమాధానంగా నిలిచాయి.
ఇప్పటికి అక్కడ అక్కడ ఖుమ్రాన్ గుహలలో వీరు భద్రపరచిన ప్రతులు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటికి 972 కి పైగా వీరు వ్రాసిన ముఖ్యమైన చేవ్రాత ప్రతులు మ్యూజియంలలో భద్రపరచబడ్డాయి.
ముగింపు :
ఈ ఎస్సేనులు వారి జీవిత కాలంలో ఎవరి మన్ననలు పొందుకోకపోయినా దేవుని కొరకు వారు పడిన ప్రయాస నేటి ప్రజలకు ఘనమైన చరిత్రను మిగిల్చింది.
ఈ ఎస్సేన్లు రోమా సామ్రాజ్యంచే హింసించబ,చివరికి చరిత్ర నుండి అదృశ్యమయిపోయారు.
ఇది పరిశుద్ధగ్రంధ ప్రతులను నకల్లను తయారుచేసి, దేవుని ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎస్సేనుల చరిత్ర. ప్రజలు వీరిని మరుగుపరిచి, పట్టించుకోకపోయినా కూడా దేవుడు మరుగుచేయని భక్తి కలిగిన యూదులు ఈ ఎస్సేనులు .
చూసారు కదా మరో ఆసక్తి కరమైన బైబిల్ అంశంతో మళ్ళీ కలుద్దాం.